ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్రకుట్రకు, ఈ పేలుడుతో లింక్ ఉండటం.. ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన ఐదుగురు డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడుకు ముందు దుండగులు పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.


