గుజరాత్ అడవుల్లో అరుదైన దృష్యం కనిపించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది. ఈ విషయాన్ని అక్కడి అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దాహోద్ జిల్లాలోని రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం లో గత తొమ్మిది నెలలుగా మగ పులి నివసిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో రాయల్ బెంగాల్ టైగర్ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఈ పెద్ద పులి వయసు దాదాపు 5 ఏళ్లు ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పులిని మొదట మధ్యప్రదేశ్‌లోని ఝబువా, కథివాడ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రతన్ మహల్ సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించారు. అప్పటి నుంచి అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, ఫీల్డ్ టీమ్‌ల ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు.


