ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంగ్లాలో అశాంతి నెలకొంది. ఈ నిరసనల వేళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు సకాలంలో జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ కు తెలియజేశారు.
సెర్గియో గోర్‌తో యూనస్ ఫోన్లో సంభాషించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలనే తన నిబద్ధతను యూనస్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన గురించి ప్రస్తావిస్తూ, నిరంకుశ పాలన సమయంలో దొంగలించిన తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని యూనస్ వ్యాఖ్యానించారు.


