అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈస్ట్ వింగ్ భవనాన్ని కూల్చివేసి, దాని స్థానంలో అధునాతన బాల్‌రూమ్ ను నిర్మించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే కూల్చివేత పనులు ప్రారంభం కాగా, ఈ వారాంతానికి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.
కొత్త బాల్‌రూమ్ నిర్మాణం కోసం సుమారు 250 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2,000 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. వాస్తవానికి వేసవిలో ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు ప్రస్తుత భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తి భవనాన్ని కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. తాము పారదర్శకంగా ఉన్నామని విలేకరులతో అన్నారు.


