ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్ కి పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఛలో బస్ భవన్ ధర్నా లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ భవన్లో మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. నందినగర్ నుంచి కేటీఆర్, మెహిదీపట్నం నుంచి హరీశ్‌రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్‌కి చేరుకుంటారని తెలిపారు. పెంచిన బస్సు చార్జీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే, వాళ్ల కుటుంబ సభ్యులపై భారం వేయడం అన్యాయమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయిన వారి సంఖ్యనే ఎక్కువని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పిందని గుర్తుచేశారు.


