ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న 2018 గ్రూప్ వన్ పరీక్ష నుంచి ఎంపికైన అధికారులను ఫోకల్ పోస్ట్ నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులందరూ వెంటనే సంబంధిత శాఖ అధిపతి వద్ద రిపోర్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. ఈ రోజు(బుధవారం) రాత్రి ఏడు గంటల్లోపు ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు.
అయితే, గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ఏపీ హైకోర్టు విచారణ చేస్తోంది. ఫోకల్ పోస్టులో ఉన్న 2018 గ్రూప్-1 అధికారులందరినీ ఆప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత వారం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధర్మాసనం ముందు హాజరు కావాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. రేపటి(గురువారం)లోగా అధికారులందరినీ బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఫోకల్ పోస్టుల్లో ఉన్న అధికారులందరినీ రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


