హైదరాబాద్ మెట్రో లో 20 మంది ట్రాన్స్‌జెండర్ల ను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం . ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతికి, వారు ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారని, ఈ నేపథ్యంలోనే వీరిని నియమించారని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామని ఉద్ఘాటించారు. వారు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పుకొచ్చారు. వీరు ఈ సమాజానికి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.


