భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనతను సాధించింది. నవతరం, స్వదేశీ బాహుబలి రాకెట్ ద్వారా భారత గడ్డపై నుంచి అత్యంత భారీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా 4,410 కేజీల బరువు గల కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-03ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారత దేశ భూభాగంతోపాటు సముద్ర ప్రాంతాల్లో కూడా సేవలందిస్తుంది. ప్రత్యేకించి నేవీ కోసం దీన్ని రూపొందించారు. దేశం చుట్టూ విస్తరించిన సముద్ర ప్రాంతంలో టెలి కమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. దీన్ని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు.


