ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం రేపు (శుక్రవారం) ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రేపటి కేబినెట్ సమావేశంలో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో రూ.212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్‌భవన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరుగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదించనుంది కేబినెట్. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి, రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


