ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఆదాయంలో రికార్డ్ సృష్టించింది. జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డ్‌ను నెలకొల్పింది. జనవరి 19న ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణించారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రత్యేక బస్సులు నడిపి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఈ అసాధారణ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులందరినీ ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.


