వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని, వారి జీవితమే ఫేక్ అని ఎద్దేవా చేశారు. సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారి పల్లిలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదలసేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తనపై నెట్టేశారని ఫైర్ అయ్యారు. సాక్షిలో గుండెపోటు అని వస్తే తానూ నమ్మేశానని, తానెప్పుడూ రాగద్వేషాలతో పనిచేయని స్పష్టం చేశారు. ఓ సర్కిల్ ఇనస్పెక్టర్‌ని దగ్గర పెట్టుకుని రక్తం పడిన గదిని కడిగేశారని, ఆధారాలు చెరిపేశారని విమర్శించారు. వివేకా కుమార్తె ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు గొడ్డలి పోటని ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. వివేకా హత్య ఘటనలో ఏమరుపాటుకు గురయ్యామని చెప్పుకొచ్చారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారని విమర్శించారు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా? అసలు వారికి పార్టీగా ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అనుకుంటే ఎంతటి వారినైనా ఢీ కొంటానని స్పష్టం చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ను, హైదరాబాద్‌లో మత విద్వేషాలు, నక్సల్స్ సమస్యనూ అణచివేశానని గుర్తుచేశారు.


