దాయాది పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర ద్వివేది ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటల ట్రైలర్ మాత్రమేనని అన్నారు. దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ 88 గంటల్లో ముగిసిన ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా మేం సిద్ధంగా ఉన్నాం. పాక్ అవకాశం ఇస్తే, పొరుగుదేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో దాయాదికి మేము నేర్పిస్తాము అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.


