స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరం బతుకమ్మ సంబురాలతో పులకించిపోయింది. స్విస్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో హిర్జెన్‌బాచ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలు, వారి దశాబ్దకాల సాంస్కృతిక ప్రస్థానానికి దర్పణం పట్టాయి.తెలంగాణ సంస్కృతికి జీవనాడిగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశీ గడ్డపై జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరి ఉత్సాహంగా ఆడిపాడారు. వారి జానపద గీతాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. ప్రకృతిని ఆరాధిస్తూ, భూమి, నీరు, మానవుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఈ పండుగ స్ఫూర్తిని స్విస్‌లో నివసిస్తున్న తెలుగువారు అద్భుతంగా ఆవిష్కరించారు. ఉత్సవాల ముగింపులో మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలోని జలవనరులలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం స్విట్జర్లాండ్‌లోని తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించడమే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. వేడుకలకు హాజరైన వారికి అందించిన తెలంగాణ పిండివంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిర్వాహక బృందం సభ్యులు శ్రీధర్ గండే, కిషోర్ తాటికొండ, అనిల్ జాల, అల్లు కృష్ణ, పవన్ దుద్దిళ్లతో పాటు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని స్విస్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు.


