మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలని సూచించారు. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆజ్ఞాపించారు. తుపాను ప్రభావిత తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా శిబిరాల్లోని నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.


