సీజనల్ పండ్లు అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. మనకు ఏడాదిలో వచ్చే ఆయా సీజన్లలో పలు రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిని తింటే ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక అలాంటి పండ్లలో సీతాఫలాలు కూడా ఒకటి. ఇవి ఈ సీజన్లో అధికంగా లభిస్తుంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి ఎంతో తియ్యగా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, కారెనోయిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. సీతాఫలాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇన్ఫెక్షన్లతోపాటు దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
సీతాఫలాలను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 101 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 25 గ్రాములు, సహజసిద్ధమైన చక్కెరలు 12.7 గ్రాములు, ఫైబర్ 2.4 గ్రాములు, ప్రోటీన్లు 1.7 గ్రాములు ఉంటాయి. అధిక మొత్తాల్లో విటమిన్లు సి, బి6, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇక సీతాఫలాలను ఎవరైనా సరే తినవచ్చు. కానీ డయాబెటిస్ ఉన్నవారు అధికంగా తినకూడదు. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటే 50 గ్రాముల మోతాదులో లేదా ఒక పండును తినవచ్చు. షుగర్ నియంత్రణలో లేకపోతే ఈ పండ్లను తినకూడదు. అలాగే బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు కూడా ఈ పండ్లకు దూరంగా ఉంటే మంచిది. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ సీతాఫలాలను తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి.


