పేదల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. రుణాలు తీసుకుని లక్షల మంది లబ్ది పొందుతున్నార ని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి, వడ్డీ ప్రభుత్వం కడుతోందని మంత్రి వెల్లడించారు. 95 శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న ఋణాలు చెల్లిస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సుపై బీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడవాళ్ళు ఒక్క దగ్గర ఉండరని, కొట్టుకుంటారు అని మహిళలను ఇన్సల్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లుగా మార్చామని అన్నారు. పెట్రోల్ బంక్‌లు నిర్వహిస్తూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. నగరంలో 35 చోట్ల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడిపిస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలపై బీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారం నమ్మొద్దన్నారు.


