బాలికల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా అందజేయనుంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ వ్యాక్సిన్ అందజేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపిలోమా వైరస్) టైప్ 16, 18, హెచ్‌పీవీ 6, 11 అనే నాలుగు రకాల సెర్వికల్ క్యాన్సర్‌ల నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ రక్షిస్తుంది.
ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తున్నప్పటికీ.. తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే స్వచ్ఛందంగా మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ప్రభుత్వ వైద్య శాలల్లో ఉచితంగా అందజేస్తారు. త్వరలోనే ఈ వ్యాక్సినేసన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.


