భారత పౌరవిమానయాన శాఖ విమానాల్లో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వాములు ఇరుముడి తో ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సిరావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు.. విమాన ప్రయాణంలో అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తిచేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమానంలో తమతో పాటు తీసుకెళ్లవచ్చని చెప్పారు. అయితే భక్తులందరూ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని సూచించారు.


