తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ -2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. నీతి అయోగ్ సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ప్రధాని మోదీకి తెలిపారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తదితరులు ఉన్నారు.


