రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మన్నెవారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తప్పులు చేసి, అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్‌ని పక్కన బెట్టారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలని క్షమించరని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ని తమ ప్రభుత్వం లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్‌బీసీ విషయంలో తమ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీశ్‌రావు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు.
గత పదేళ్లలో ఏ ప్రాజెక్టునూ కేసీఆర్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెబుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అలుసైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉండి ఉంటే టన్నెల్ పనులు ఎప్పుడో పూర్తయ్యేవని చెప్పుకొచ్చారు. ఎస్ఎల్‌బీసీని గత కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. కమీషన్లు రావని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎస్ఎల్‌బీసీని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 10 కిలోమీటర్లు కూడా టన్నెల్ పనులు పూర్తికాలేదని చెప్పుకొచ్చారు. టన్నెల్ పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందనే కారణంతోనే గాలికొదిలేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


