భారత త్రివిధ దళాల ఆధునికీకరణతో పాటు దేశీయ రక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల సేకరణ ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు, సీనియర్ రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ నిర్ణయం ద్వారా భారత సైన్యం, నావికాదళం, వాయుసేనల ఆపరేషనల్ సామర్థ్యం గణనీయంగా పెరగనుందని అధికారులు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా దిశగా స్వయం సమృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.


