శ్రీవారి దర్శనం విషయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు వంటి అత్యంత డిమాండ్ ఉన్న టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు మోసగాళ్లు అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మోసగాళ్లు తమను తాము టీటీడీ కార్యాలయాల్లో పనిచేసే అధికారులుగా, మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధుల పేషీ సిబ్బందిగా పరిచయం చేసుకుంటున్నారని చైర్మన్ వివరించారు. ఇలా భక్తులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తమ దృష్టికి అనేకం వచ్చాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు.


