కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్‌లో భారతదేశపు తొలి మహిళా రాయబారి అయిన పరమిత త్రిపాఠి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీతోపాటు అమరవీరులైన సైనికులకు పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులు అర్పించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కువైట్‌లో ఇది నా మొదటి గణతంత్ర దినోత్సవం, మీ అందరి మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నాకు గౌరవంగా ఉందన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తనకు లభించిన ఆప్యాయతకు సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం మహిళా నాయకత్వం, సాధికారత పట్ల భారతదేశం పెరుగుతున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా విదేశాలలో ఉన్న భారతీయ ప్రవాసులు భారతదేశానికి నిజమైన రాయబారులు అని సమాజ సభ్యులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికి ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


