ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ లోని భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే రోవ్ విల్లే ప్రాంతంలో గాంధీ మహాత్ముని కాంస్య విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడమే కాక, విగ్రహాన్ని కాజేశారు. విగ్రహం పాదాలు మాత్రమే ఉంచి, కాళ్ల వరకు కోసి వేసి ఎత్తు కెళ్లారు. ఈ సంఘటనపై భారతీయ సమాజం స్థానిక విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ విషయాన్ని అధికారికంగా చర్చించింది. విగ్రహాన్ని తక్షణం వెతికి పట్టుకోవాలని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. మీడియా ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ అపహరణకు గురైన విగ్రహాన్ని త్వరగా కనిపెట్టాలని ఆస్ట్రేలియా అధికారులను కోరినట్టు చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియా భారతీయ సమాజానికి బహుమతిగా అందజేసింది. ఆస్ట్రేలియా అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ 2021నవంబర్ 12న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా భారత సమాజానికి ప్రముఖ సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలగిన చిహ్నంగా ఈ విగ్రహం గుర్తింపు పొందుతోంది. రోవ్‌విల్లే లోని కింగ్‌స్లే క్లోజ్ అనే ధార్మిక సంస్థ ఆవరణలోని ఆగంతకులు ముగ్గురు ఈ విగ్రహాన్ని చోరీ చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు.


