ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విడుదల చేసినట్లు గురువారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల చేశామని.. మొత్తం 59,297 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఇది గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని ఆమె అన్నారు.


