భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. నిరంతరం మంచు వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, ఇళ్లను మంచు కప్పేసింది. స్కీయింగ్ సిటీ ఎటు చూసినా శ్వేత వర్ణం సంతరించుకుని పర్యాటకులను ఆహ్వానిస్తోంది. స్థానికులు, పర్యాటకులు శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గుల్మార్గ్‌తోపాటూ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సోనామార్గ్, జోజిలా, గగాంగిర్, కుప్వారాలో కూడా మంచు పడుతోంది. శ్రీనగర్ వాతావరణ కేంద్రం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో గుల్మార్గ్‌లో 7.6 సెంటీమీటర్ల మేర మంచు పడింది. దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో కూడా గత 24 గంటల్లో 2.1 సెంటీమీటర్ల మంచు, 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.


