మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటిచెప్పారు. తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం హరీశ్‌రావు ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి రూ.20లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్ ఫీజు కోసం లక్ష రూపాయలు కూడా అందజేశారు.
సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రం దంపతుల కూతురు మమతకు ఇటీవల పీజీ వైద్య విద్యలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లకు రూ. 22.50 లక్షలు కట్టాల్సి రావడంతో ఆమెకు ఏం చేయాలని తోచలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 చివరి తేదీ, ఆ గడువులోగా ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి. బ్యాంకులో లోన్ కోసం వెళ్తే ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే కానీ రుణం మంజూరు చేయాలేమని బ్యాంకర్స్ చెప్పారు. మమత తండ్రి హరీశ్‌రావును కలిసి, తన పరిస్థితిని వివరించారు. దీంతో చదువుల తల్లికి సాయం చేయాలని భావించిన హరీశ్‌రావు, మరో ఆలోచన చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేశారు.


