సాంకేతికతలో వడివడిగా దూసుకెళ్తున్న కృత్తిమ మేథస్సు పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అంటే భయమేస్తుందని, వింటేనే వణుకు పుడుతోందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విధ్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐతో మానవ సంబంధాలు మంటగలసి పోతాయోమోనని భయమేస్తోందని, వావివరుసలు ఎక్కడ మరిచిపోతారెమోనన్న భయం నాలో ఉందని అన్నారు. దీనికి పరిష్కార మార్గాన్ని ఆయన సూచించారు.
విధ్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐని కట్టడి చేయాలని, ఏఐపై ఉన్న భయాలు తొలగించి ఏఐని అదుపులోకి చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. నైతిక పద్దతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్దంగా ఏఐని ఎలా ఉపయోగించుకోవాలన్నది సవాలేనని అన్నారు. లేని పక్షంలో ఏఐ మహాభూతమై సమాజాన్ని సంక్షోభమార్గంలో తీసుకు వెళుతుందని వెల్లడించారు. ఏఐ వల్ల మానవాళికి నష్టం జరుగకుండా ప్రధాని మోదీ పలు సూచనలు చేశారని వివరించారు. సమాజం కూడా ఎప్పటికప్పుడూ స్పందించి పలు సూచనలు చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ, ఏపీలో చంద్రబాబు నాయుడు ఏఐని టెక్నాలజీని ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసించారు. రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్లంతా ఓడిపోయారని అన్నారు.


