అన్షు మరియు వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ హుషారు పిట్టలు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ విడుదల చేస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి మంగళస్నానం అనే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఒక తండ్రి తన కూతురిని ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారో, ఆమెపై ఎంతటి ప్రాణాన్ని పెట్టుకుంటారో అద్భుతంగా ఆవిష్కరించింది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే విడదీయలేని అనుబంధానికి ఈ గీతం అద్దం పడుతోంది. ఎస్.ఎస్. చిరంజన్ హృద్యమైన సాహిత్యం అందించగా, యోగి సురేష్ మరియు విహా తమ గాత్రంతో ప్రాణం పోశారు. చరణ్ అర్జున్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అన్షు, వాసవి గణేషన్‌లతో పాటు గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


