బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని ఈటల గుర్తు చేశారు. వాస్తవాలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న బీసీ జనాభా లెక్కలు పూర్తిగా తప్పులతడక అని విమర్శించారు. 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపడం కేవలం కాకి లెక్కలు చెప్పడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నామమాత్రంగా కమిషన్లు వేస్తోందే తప్ప, వాటిని అమలు చేయడంలో నిజాయతీ చూపడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీల విషయంలో ఇలాగే వ్యవహరించిందని, కేసీఆర్ హయాంలో సర్వేలు చేసి, కమిషన్లు వేసినా చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీలకు న్యాయం జరగలేదని విమర్శించారు.


