అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. ఇదే జరిగితే రెండు దేశాల మధ్య భారీ యుద్ధానికి దారి తీస్తుంది. అయితే, ఈ పరిస్థితిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. అమెరికాతో యుద్ధానికైనా, శాంతికైనా సిద్ధమేనని ప్రకటించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అమెరికాతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం రెండు దేశాలకే పరిమితం కాదు. ఇది భారీ ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు యుద్ధంలో చేరాల్సి రావొచ్చు. ఇరాన్ యుద్ధానికైనా, శాంతికైనా సిద్ధంగా ఉంది. అమెరికాతో అణు ఒప్పందం విషయంలో మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ విషయంలో స్పష్టమైన, సమతూకమైన ఒప్పందాన్ని సాధించాలి. ఒప్పందం విషయంలో అమెరికాకు స్పష్టమైన వైఖరి లేదు. వాళ్లు మాతో ఒకవైపు అంగీకారం చేసుకుని, ఇంకోవైపు దాడి చేశారు. అమెరికా ఒక స్పష్టమైన, అంకితభావంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైతే మేం కూడా సిద్ధమే. అణు ఒప్పందం విషయంలో వాళ్ల ఆందోళనలపై చర్చించేందుకు కూడా సిద్ధం అని అబ్బాస్ అన్నారు.


