విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని తెలియజేశారు. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందన్నారు. గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని, జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని సమావేశంలో చెప్పారు. ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని, దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నామన్నారు. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలని, అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు.ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని స్పష్టం చేశారు. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామన్నారు. ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందని తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని సీఎం అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి సాటి లేదన్నారు. వీటిని ఉపయోగించుకోవాలని యూరోప్ దేశాల్లోని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కోరారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుంది, అందులో ఏపీ ముందుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.


