ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. ప్రపంచంలోనే మేటి జట్టైన ఆసీస్‌ను భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. అడిలైడ్‌లో 17 పరుగులతో గెలిచి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59)ల విధ్వసంతో ఆసీస్‌కు సవాల్ విసిరిన టీమిండియాకు ఆతిథ్య జట్టు బదులివ్వలేకపోయింది. అష్లే గార్డ్నర్ (57) అర్ద శతకంతో రాణించినా శ్రేయాంక పాటిల్(3-22) వికెట్ల వేటతో దెబ్బతీసింది. ఫలితంగా భారీ ఛేదనలో 159కే పరిమితమైన కంగారూ టీమ్ సిరీస్ కోల్పోయింది.
వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా విదేశీ పర్యటనలో తొలి సీరస్ గెలుపొందింది భారత జట్టు. ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించిన భారత జట్టు టీ20 సిరీస్‌లో పంజా విసిరింది. తొలి పోరులోనే ఆసీస్‌కు షాకిచ్చిన టీమిండియా.. రెండో మ్యాచ్‌ను చేజేతులా వదిలేసింది. అయితే.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఓపెనర్ స్మృతి మంధాన(82) అంతర్జాతీయ క్రికెట్లో 70వ అర్ధ శతకంతో, జెమీమా రోడ్రిగ్స్(59) విధ్వంసంతో ఆతిథ్య జట్టు బౌలర్లు నీరుగారిపోయారు.
భారీ ఛేదనలో ఆస్ట్రేలియాను శ్రేయాంక పాటిల్(౦3-22) ఆదిలోనే దెబ్బకొట్టింది. గత మ్యాచ్‌లో చెలరేగిన జార్జియా వోల్(10) ను తను ఔట్ చేయగా ఫొబే లిచ్‌ఫీల్డ్(26)ను శ్రీ చరణి వెనక్కి పంపింది. అష్లీ గార్డ్నర్(57) హాఫ్ సెంచరీతో పోరాడినా శ్రీచరణి(3-32), అరుంధతి రెడ్డి(2-35)లు వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. ఆఖర్లో అనాబెల్ సథర్లాండ్(14)ను వెనక్కి పంపిన చరణి ఆసీస్ ఓటమిని పరిపూర్ణం చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టుకు ఇది రెండో టీ20 సిరీస్ విజయం. మెరుపు అర్ధ శతకంతో టీమిండియా గెలుపులో కీలకమైన మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది.


