శ్రీలంకకు మానవతా సాయాన్ని తీసుకువెళ్తున్న తమ విమానాన్ని భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించడం లేదంటూ పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తి అసంబద్ధమైన ప్రకటన అని, ఇండియాకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేందుకు పాక్ జరిపిన మరో ప్రయత్నమని పేర్కొంది. పాక్ నుంచి అభ్యర్థన అందిన 4 గంటల్లోనే అనుమతి ఇచ్చామని స్పష్టం చేసింది.
మానవతాసాయంతో కూడిన విమానానికి భారత్ క్లియరెన్స్ ఇవ్వలేదంటూ పాక్ చేసిన ప్రకటనను ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారంనాడు జరిపిన మీడియా సమావేశంలో తప్పుపట్టారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలో నిజం లేదు. భారతకు వ్యతిరేకంగా జరుపుతున్న మరో తప్పుడు ప్రచారం ఇది అని తెలిపారు.


