భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై మోజు తగ్గుతున్నది. వీసా నిబంధనలు, పెరిగిన వ్యయం, తగ్గిన ఉపాధి అవకాశాల నేపథ్యంలో భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు బదులుగా యూరప్‌వైపు తమ దృష్టి మరల్చారు. గత రెండేండ్లలో ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకొనే భారత విద్యార్థుల సంఖ్య 63శాతం తగ్గినట్టు విద్యారుణాలు అందించే జ్ఞాన్‌ధన్ సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకొనే భారత విద్యార్థుల్లో అమెరికాను ఎంచుకొనే వారు 2023లో 54 శాతం మంది ఉండగా అది 2025 నాటికి 20 శాతానికి పడిపోయినట్టు ఆ వివరాలు తెలుపుతున్నాయి. అమెరికాలో ఇటీవల అమలులోకి వచ్చిన కఠిన వీసా నిబంధనలు, పెరిగిన ఖర్చులు, విద్యానంతరం ఉపాధి అవకాశాలకు గ్యారెంటీ లేకపోవడం వంటి అంశాలు విద్యార్థులను యూరప్ వైపు మరలుస్తున్నాయని జ్ఞాన్‌ధన్ సీఈవో అంకిత్ మెహ్రా పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ఫీజు పెంపుదల, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) సమీక్షలు వంటి అంశాలు విద్యార్థులను ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించేలా చేశాయని తెలిపారు. ఎక్కువ మంది భారత విద్యార్థులు యూరప్‌లోని జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.


