అమెరికా సర్కారుకు భారత ప్రభుత్వం తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రబడ్జెట్ పై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ లోక్‌సభ లో మాట్లాడారు. తన ప్రసంగంలో వాణిజ్య ఒప్పందంతోపాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించారని చెప్పారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదని అన్నారు.
ప్రపంచం మొత్తం ఏఐ యుగంలోకి వెళ్తోందని చెబుతున్నారు. దీనివల్ల భారత ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలకు ప్రమాదం ఉంది. మన దేశానికి ప్రతిభావంతులైన యువతరం పెద్ద ఆస్తి. ఏఐకి ఇంధనమే డేటా, డేటా లేకుండా ఏఐ ఏమీ చేయలేదు. అమెరికా సూపర్ పవర్‌గా కొనసాగాలంటే భారత్ డేటానే కీలకం. గతంలో అధిక జనాభాను సమస్యగా భావించేవారు. కానీ జనాభా మనకు అతిపెద్ద ఆస్తి. మన డేటాను కాపాడుకునేందుకు భారత్ చర్యలు తీసుకోవడం లేదు. అమెరికా కంపెనీల కోసం ట్యాక్స్ హాలిడే ప్రకటించింది అని రాహుల్ విమర్శించారు.


