భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని, భారతీయ వంటలు అందరూ తినాలని దేశ ప్రజలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. విశాఖపట్నంపై తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. విద్యార్థి దశలో ఎన్నో పోరాటాలు చేశానని, జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఆమె కారణంగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. స్వతంత్ర భారతదేశంలో ఆత్మ నిర్భర భారత్ కోసం అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో నాలుగో వంతు జీడీపీ భారతదేశానిదేనని పేర్కొన్నారు. పశు సంపద ఎంత బాగుంటే జాతీయ సంపద కూడా అంత బాగుంటుందన్నారు. ఆత్మ నిర్భర భారత్ ముందు,ఎవరు ఎన్ని సుంకాలు వేసినా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అందుకే ఆత్మ నిర్భర భారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారని వివరించారు. తాను రైతు బిడ్డగా పుట్టానని, అందుకే రైతులు అంటే తనకు చాలా అభిమానమన్నారు.


