కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. బంగారం చోరీ కేసులు రోజు రొజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమల ఆలయంలోని విలువైన కళాఖండాల నుండి బంగారం దొంగిలించబడిందనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న దర్యాప్తులో ఆలయ ఉద్యోగుల ఖాతాల్లో అనుమానాస్పద నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి వార్షిక పండుగ సీజన్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక వ్యవహారా ల్లో భారీ అసమానతలు కనిపించడంతో, ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు కొనసాగిన రెండు నెలల మాండల-మకర విలక్కు పండుగ సీజన్‌లో ఆలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది ఆర్థిక కార్యకలాపాల పై శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సమీక్షించింది. ఈ నివేదికలో ఆలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసుల ద్వారా జరిగిన నగదు బదిలీలు, అలాగే ఆ నిధుల మూలాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.


