ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేతలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు.
కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని ఇది చారిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు సీఎం. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్పడి, నాలెడ్జి ఎకనామీకి పునాది పడిందని గుర్తుచేశారు. ఏపీకి గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉందన్నారు. గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారన్నారు. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చిందని, దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని సీఎం పేర్కొన్నారు.


