అహానా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని, కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు, ఆయన సతీమణి, టీడీపీ నాయకురాలు సుజాతతో పాటు పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ఆ నేతలకు కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వేసిన నామినేషన్ విత్‌డ్రా చేసుకొని మరీ బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్న ప్రవీణ్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. శ్రీనివాస్ నాయుడు చాలా కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఐదేళ్ల కిందటే రావాల్సిన నాయకుడు ఇప్పుడు వచ్చారని అన్నారు.
మన పార్టీ నుంచి గెలిచి మేయర్ అయిన వ్యక్తి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డే ఏ పనులు చేయట్లేదని, ఇక మేయర్ మనకు ఏం పనులు చేస్తుందని దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే, తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఇవ్వకపోగా, మెడలో గొలుసు కూడా లాక్కెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


