గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో 100 గదులు ఉండేలా ధర్మశాలను నిర్మించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మను ఇచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు అని అన్నారు. టీటీడీ, తెలంగాణ నేతల సమిష్టి కృషితోనే ధర్మశాల నిర్మాణం విషయంలో ముందడుగు పడిందని అన్నారు. భక్తుల బలమైన సంకల్పంతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


