ములుగు జిల్లాలో ఇటీవల నిర్వహించిన మేడారం జాతర విజయవంతమైందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సెక్రటేరియట్‌లో విలేకర్లతో సీతక్క మాట్లాడారు. జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. కొంత మంది జాతరతోపాటు ఏర్పాట్లపై విష ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగిసిందని పేర్కొన్నారు. ఒక దొంగతనం ఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని వివరించారు. ఒకట్రెండు రోజుల్లో తిరుగు జాతర జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఈ జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారని వివరించారు. క్లాస్, మాస్‌తోపాటు ఉన్నత స్థాయి వర్గాల వారు సైతం ఈ జాతరకు భారీగా తరలివచ్చారని చెప్పారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు ఈ మేడారం జాతరకు వచ్చినట్లు భావిస్తున్నామన్నారు. వచ్చే జాతర సమయానికి మేడారం పరిసర ప్రాంతాల్లోని రహదారులను వెడల్పు చేసి, ట్రాఫిక్ జామ్‌లను నివారిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ములుగు జిల్లా పరిధిలో పనులపై అధికారులతో సమీక్షిస్తామని ఈ సందర్భంగా సీతక్క స్పష్టం చేశారు.


