రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ బడ్జెట్ చర్చల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం వనభోజనాల తరహాలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాజకీయ చర్చలకు తావులేకుండా, కేవలం కుటుంబ విషయాలు, పిల్లల చదువులు, వారికి గల క్రీడాభిలాషపై మాట్లాడుకున్నారు. సమావేశానికి వచ్చిన చిన్నపిల్లలతో లోకేష్ సరదాగా కబుర్లు చెబుతూ గడిపారు. చదువు, కెరీర్ ఒక్కటే జీవితం కాదు, పిల్లలు క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని లోకేష్ ఈ సందర్భంగా సూచించారు.


