మాక్ అసెంబ్లీ అద్భుతమని, విద్యార్థులు అదరగొట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల రూల్స్‌ను విద్యార్థులు ప్రదర్శించారు. మాక్ అసెంబ్లీలో సమకాలీన రాజకీయ అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. సభ్యుల మధ్య వాదోపవాదాలతో రక్తికట్టింది మాక్ అసెంబ్లీ. విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాక్ అసెంబ్లీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని, అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని, అయితే ఏ పనిచేసినా పద్దతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పిలిచారని, యూనివర్సిటీ లెక్చరర్‌గా చేరాలని తనను అడిగారని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను మంత్రిని అయ్యానని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు.


