జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పది చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్‌లలో అనుమానితులు, వారి సహచరులకు సంబంధించిన స్థలాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేసినట్లుగా ఎన్‌ఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కేసు 2023లో నమోదైంది. నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు మొహమ్మద్ సోజిబ్ మియాన్, మున్నా ఖలీద్ అన్సారీ, అజ్రుల్ ఇస్లాం, అబ్దుల్ లతీఫ్ పేర్లు ఇందులో ఉన్నాయి. నిందితులు ఫేక్ ఐడీలను ఉపయోగించి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు.వారికి నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్‌లోని అల్-ఖైదా కార్యకర్తలకు నిధులు సేకరించడం, బదిలీ చేసినట్లుగా తేలింది. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు.


