భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నియ్యారు. అధికారికంగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ కే లక్ష్మణ్ చేతుల మీదుగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సర్టిఫికేట్‌ను నితిన్ అందుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా నితిన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
45 ఏళ్ల వయసులోనే నితిన్ నబిన్ కీలక పదవిని చేపట్టారు. బీహార్‌లోని బంకిపుర్ సీటు నుంచి ఆయన వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడే ఆయన. నబిన్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. జెడ్ కేటగిరీలో సీఆర్పీఎఫ్ కమాండోలు ఉంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా నబిన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చారు.


