సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన ఉదారతను చాటుకుంటూ ఆదర్శంగా నిలిచాడు. చెన్నైలోని టి.నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న పద్మ అనే మహిళ తనకు దొరికిన 45 తులాల బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ బంగారం ఒక నగల వ్యాపారికి చెందినదిగా పోలీసులు నిర్ధారించి బాధితులకు అప్పగించడంతో పద్మ నిజాయితీ వార్తల్లో నిలిచింది.
ఇక పద్మ చూపిన అసాధారణ నిజాయితీకి ముగ్ధులైన రజనీకాంత్ ఆమెను ఇంటికి ఆహ్వానించి శాలువాతో సత్కరించడమే కాకుండా, ఆమెకు గుర్తుగా ఒక బంగారు గొలుసును బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోను రజనీకాంత్ టీమ్ పంచుకుంది. మరోవైపు పద్మ చేసిన మంచి పని కేవలం సినీ వర్గాలనే కాకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కదిలించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆమెను ప్రత్యేకంగా సన్మానించి రూ. 1 లక్ష నగదు పురస్కారం అందజేయగా, భారత తపాలా శాఖ ఆమె గౌరవార్థం ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయడం విశేషం.


