అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు (ఏ1), ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చింది. సీబీఐ వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈనెల 11న లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్, తన సొంత ఫోన్ నెంబర్ను వెల్లడించలేదంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు మూడు సార్లు కాల్ చేశామని, కానీ ఆయన ఇచ్చిన నెంబర్ పనిచేయలేదని సీబీఐ తెలిపింది.
ఉద్దేశపూర్వకంగానే పని చేయని నెంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇకపై జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించింది. అయితే అసలు జగన్ ఫోన్ వాడరని, గతంలో కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు, సీబీఐ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ పిటిషన్పై ఈనెల 22న వాదనలు జరుగగా, కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.


