జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్‌లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలం ప్రారంభమైన కొద్ది నెలలకే ఆమె ఖాతాలో మరో విజయం వేసుకుంది. 2026 ఫిబ్రవరి 8న జపాన్‌లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. లోయర్ హౌస్‌లో సూపర్ మెజారిటీ సాధించింది. మొత్తం 465 సీట్లున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఎల్‌డిపి ఒంటరిగానే 316 సీట్లు గెలుచుకుంది. ఇది సాధారణ మెజారిటీ మార్కు (233) కంటే ఎంతో ఎక్కువ. మిత్రపక్షమైన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జెఐపి)తో కలిపి ఈ కూటమి మొత్తం 352 సీట్లను కైవసం చేసుకుంది.


