రెండో దశ పోలింగ్‌కు బీహార్ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ఈనెల 6న నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పోలింగ్ నవంబర్ 11 మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. పోలింగ్ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 4 లక్షలకుపైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
243 అసెంబ్లీ స్థానాలకు గానూ 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా, రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది (దాదాపు 10 శాతం) మహిళలే. రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్‌లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి.


